Monday 30 April 2012

తెలుగు సాహిత్యంలో గణపతి - బూదాటి వెంకటేశ్వర్లు


తెలుగు సాహిత్యంలో గణపతి

మన కావ్య ప్రబంధాల్లో దేవతాస్తుతుల్లో భాగంగా గణపతి స్తుతి కూడా చోటుచేసుకుంది. ఆ అధినాయకుని తెలుగు పద్య కవులు ఎంతో హృద్యంగా వర్ణించారు. గణపతిపై ప్రత్యేకంగా పద్యం చెప్పిన కవులు తక్కువే- వాటిని ఒకసారి స్మరించుకుందాం.
అల్లసాని వారి అల్లిక:
"అంకము జేరి శైల తనయాస్తనదుగ్ధము లానువేళబా
ల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్ గబళింపబోయి, యా
వంకకుచంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్''
పరమశివుడు అర్ధనారీశ్వరుడు గదా! ఆ రూపంలో వున్నపుడు ఎడమవైపున్న పార్వతి వద్ద గణపతి పాలను త్రాగుతున్నాడు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని పెద్దన చేసిన చమత్కారం మనల్ని అలరిస్తుంది. పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొకవంక ఉన్న స్తనాన్ని చేతితో పుణకటం సహజం పార్వతీదేవి వద్ద పాలు తాగుతున్న బాలగణపతి చేసే పసితనపు చేష్టను పెద్దన చమత్కరించాడు. అలా ఒకవైపు తాగుతున్న గణపతి రెండవవైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు. సర్పహారాలు కనిపించాయి. దానిని లేత తామరతూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి విఘ్నేశ్వరుని నా కోరికలెల్ల సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు. ఈ పద్యంలోని వినాయకుని భ్రాంతి, మనుచరిత్రకథలోని వరూధిని భ్రాంతికి సూచన అంటారు విమర్శకులు.


మొల్ల బొమ్మ కట్టించిన గణపతిని చూడండి:
చంద్రఖండకలాపు, జారువామనరూపు,
గలితచంచల కర్ణుగమల వర్ణు,
మోదకోజ్జ్వల బాహు, మూషకోత్తమవాహు,
భద్రేభవదను, సద్భక్తసదను,
సన్మునిస్తుతిపాత్రు, శైలసంభవపుత్రు,
ననుదినామోదు విద్యాప్రసాదు,
పరమదయాభ్యాస, బాశాంకుశోల్లాసు,
మరుతరఖ్యాతు, నాగోపవీతు

లోకవందిత గుణవంతు, నేకదంతు
నతులహేరంబు, సత్కరుణావలంబు
విమల రవికోటి తేజు, శ్రీవిఘ్నరాజు
బ్రధిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు ॥
చంద్రరేఖ అలంకారంగా కలవాడు, అందమైన గుజ్జురూపం, కదిలే చెవులు, చేతిలో ఉండ్రాళ్ళున్నవాడు, మూషికవాహనుడు, గజముఖుడు, సద్భక్తులయెడ నిలిచేవాడు, పరమమునులచే స్తుతించబడేవాడు, పార్వతీపుత్రుడు, విద్యలిచ్చేవాడు, అనుదినానందకరుడు, దయామయుడు, పాశము, అంకుశము ధరించి, నాగయజ్ఞోపవీత ధారియై లోకాల మ్రొక్కులు పొందే గుణవంతుడు, ఏకదంతుడు, కరుణామయుడు, కోటి సూర్యతేజుడు, హేరంబుడు అయిన శ్రీ విఘ్నరాజును నుతిస్తాను. ఇలా వినాయకుని రూపాన్ని శబ్దాలంకార మండితంగా వర్ణించి మన కళ్ళముందు నిలుపుతుంది మొల్ల.

ఇక పోతనగారి వినాయకస్తుతి తెలుగువాళ్ళ నోళ్ళలో నానిన పద్యం:
"ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికావి
చ్ఛేదికి మంజువాదికి గణేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్''
పై పద్యంలో 'అద్రి సుతాహృదయానురాగ సంపాదికి' - అని పార్వతీదేవి హృదయానురాగాన్ని పొందినవాడనటం విశేషం. విఘ్నాలు పోగొట్టి, జగజ్జనులకు మొక్కుగొని ఆనందాలిచ్చేవాడు, మూషిక వాహనుడు, ఉండ్రాళ్ళు తినేవాడు అయిన విఘ్ననాయకుని పోతన నుతించాడు.

శివకవులలో అగ్రగణ్యుడైన నన్నెచోడుడు కుమారసంభవంలో వినాయకుని వర్ణించిన తీరు ఇలా ఉంది.
తను వసితాంబుదంబు, సితదంత యుగంబచిరాంశు, లాత్మగ
ర్జనమురు గర్జనంబు, గరసద్రుచిశక్రశరాసనంబునై
చనమదవారి వృష్టిహితసస్య సమృద్ధిగ నభ్రవేళనా
జను గణనాథు గొల్తుననిశంబునభీష్ట ఫలప్రదాతగాన్ ॥
అని స్తుతిస్తాడు. ఇందులో నీలమేఘమే విఘ్నేశ్వరుని తనువు. మెరుపే తెల్లని దంతపుకొన. ఉరుమే గర్జన. ఇంద్రధనుస్సే తొండము కాంతి. ఇలా వర్షాకాలపు లక్షణాలన్నీ గణపతి యందు ఉండుటచే నతనిని వర్షాకాలంతో రూపించటం జరిగింది. వర్షాకాలం సస్యసమృద్ధిని కలిగించునట్లు గజముఖుడు మదజలమనే వర్షంతో భక్తులకు హితాన్ని కలిగిస్తాడు. అట్టి గణపతిని తన అభీష్టాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ఇలా ఏనుగు లక్షణాలను వర్షాకాలంతో రూపించి చెప్పడం కనిపిస్తుంది.

శ్రీనాథుని వర్ణన ఇలా ఉంది:
జేజేయంచు భజింతు, నిష్టఫలసిద్ధుల్ మదింగోరి, ని
ర్వ్యాజ్య ప్రౌఢ కృపావలంబుని గటపుస్యంది దానాంబునిం
బూజాతత్పర దేవదానవ కదంబున్, బాలకేళీ కళా
రాజత్కౌతుకరంజి తోరగప్రాలంబు హేరంబునిన్ ॥
పద్యారంభం 'జేజే యంచు భజింతు' - ననటంలో పదాలు తెలుగువి కాకున్నా, తెలుగుదనంలా ఆకర్షిస్తుంది. అవ్యాజమైన దయను ప్రసరించేవాడు, చెక్కిళ్ళపై మదజలం స్రవించే గజముఖుని, దేవదానవుల పూజలందుకునే వానిని, పిల్లచేష్టలతో చంద్రుని నవ్వించేవాడు సర్పం యజ్ఞోపవీతంగా వ్రేలాడువాడు అయిన గణపతిని స్తుతించాడు.

పారిజాతాపహరణంలో నంది తిమ్మన చేసిన ఈ స్తుతిని చిత్తగించండి:
గజముఖుని ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క వరం ఇవ్వాలని కోరటం ఇందులో కనిపిస్తుంది.
"తనదంతాశ్రము చేత దీక్ష్ణమతి, యుద్యత్కుంభ యుగ్మంబు చే
తనితాంతోన్నతి, దానవిస్ఫురణ నుత్సాహంబు, శుండాముఖం
బున దీర్ఘాయువు నిచ్చు గావుతగుణాంభోరాశికింగృష్ణరా
యనికి న్వారణ రాజవక్త్రుడు కృపాయత్తైక చిత్తాబ్జుడై''
దంతం చివరిచేత కుశాగ్రబుద్ధిని, కుంభస్థలము చేత ఇతోధిక వృద్ధిని, మదజలంతో ఉత్సాహాన్ని, ఏనుగు ముఖంతో దీర్ఘాయువును దయతో విఘ్ననాయకుడు, రాయలకు ఇవ్వాలని ఇందులో భావం. అంటే మనం వినాయకుని ఆయా అంగాలను పూజించటం ద్వారా మనకు లభించే ఫలాన్ని చెప్పకనే చెప్పినట్లు.
'సంగీత సాహిత్య రహస్య కళానిధి' అనిపించుకుని వసుచరిత్ర రచనతో వాసికెక్కిన రామరాజభూషణుని స్తుతిని చూడండి. ఇది ఎంత ప్రౌఢంగా సాగిందో!

"దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీస్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజ కుందడ్గంగాఘరాచాంతిన
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబుల్వెలయింప జాలునిభరాడ్వక్త్రుంబ్రశంసించెదన్''
వినాయకుడు దంతం పెకలించి వెండికొండను కదిలించాడు. భయపడిన పార్వతి శివుని కౌగిలించుకున్నది. అంతటితో ఆగక తొండంతో శివుని జటాజూటంలోని గంగాజలాన్నంతటినీ పీల్చాడు. ఇటువంటి ప్రయత్న తీవ్రతతో, పార్వతిని సంతోషపరచి, గంగమ్మను చిన్నబుచ్చి పుత్రధర్మాన్ని (తల్లిదండ్రులను సంతోషపెట్టే పని) సార్థకం చేసిన గజాననుని కీర్తిస్తున్నాను.
కొఱవి గోపరాజు 'సింహాసనద్వాత్రింశిక'- ఆరంభంలో పార్వతీదేవి తొడలపై ఆడుకునే ముద్దుగణపతిని, పసిడిముద్దగా భావించి కీర్తిస్తాడు. అలాగే హంసవింశతి కావ్యకర్త అయ్యలరాజు నారాయణుడు 'నృత్య గణపతి'ని కీర్తిస్తాడు. ప్రబోధ చంద్రోదయంలో (నందిమల్లయ, ఘంట సింగన) విఘ్నేశ్వరుని ఆకాశతత్వానికి ప్రతీకగా సంభావించటం కనిపిస్తుంది.
ఆదిభట్ల నారాయణదాసుగారు
"బొజ్జనుండ్రాళ్ళ నించిన గుజ్జువేల్ప
పాపజన్నిదముల నెలవంక దాల్ప
రమ్ముభక్తుల భవసాగరమునదేల్ప
తగునె నాబోటి నీదు తత్వంబు బోల్ప''
- అంటూ పాడిన కీర్తన తెలుగువాళ్ళ చెవులలో ఇంకా మ్రోగుతూనే ఉంది.
కరుణశ్రీ గణపతి స్తుతిని గురించి చెప్పుకోకపోతే, గణపతి స్తుతిని గురించి చెప్పుకున్నట్లే కాదు.

ఈ పద్యాన్ని చూడండి:
ఎలుక గుఱ మునెక్కి నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకములనేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
'నల్లమామా' యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోము పంట
అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్ర విద్యార్థి! లెమ్ము జోహారులిడగ!''

ఎలుక గుర్రాన్నెక్కి ఏడేడు భువనాలు సంచరిస్తాడని, ముల్లోకాలేలే పరమేశ్వరుని ఇంటి పెత్తందారని (పెద్దకొడుకే సాధారణంగా పెత్తనం చేయటం చూస్తాం కదా! అందుకని పెత్తందారని అనటం), ఎంత గొప్పగా భావించాడు. పార్వతి విష్ణుమూర్తిని అన్నయ్యగా భావిస్తే, మరి గణపతికి మేనమామ విష్ణుమూర్తే కదా! అందుకే తన ఇంటికి అతిథిగా వచ్చిన మామయ్యను (నారాయణుని) 'నల్లమామా'- అని వరుసలాడాడట గణపతి. విష్ణువు నల్లనివాడు కదా! అందుకని. ఈ పరియాచకాలాడే సంప్రదాయం మన తెలుగు లోగిళ్ళలో నిత్యం చూసేదే. అలాంటి తెలుగుదనాన్ని ఇక్కడ పొదిగి గణపతిని మన హృదయాల చెంతకు తీసుకొచ్చిన కరుణశ్రీ ఎంత ధన్యుడు? "కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల
యిడుములందించి కలుములందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెలుగుబిడ్డల భాగ్యాలు దిద్దుగాక!''

No comments:

Post a Comment